శివానందలహరి — చాకిచర్ల నాగసుదర్శన్ రావు

ఎందరో మహాపురుషులు తిరుగాడిన పుణ్యభూమి మన హింధూదేశం. వారిలో ఆదిశంకరులు అగ్రగణ్యులు. వారు ప్రాత:స్మరణీయులు. దైవం మానుష రూపేణా అన్నట్లుగా 32 సంవత్సరములు ఆ మహానుభావుని పాద స్పర్శతో పునీతమైనది ఈ అవని. ఏమనుకున్నారు మరి , రూపొందిన సాక్షాత్ శంకర స్వరూపము ఆదిశంకరాచార్యులు ! ఆశేతు హిమాచలము పర్యటించి అవైదిక వాదనలు ఖండించి , మరలా వైదిక ధర్మాన్ని మనదేశములో నిలబెట్టిన కారణ జన్ములు ఆదిశంకరలు !

ఆయన భక్తి పారవశ్యం భాష్యాలు, ప్రకరణ గ్రంధాలు , స్తోత్రాలు రూపంలో కట్టలు తెంచుకొని పరవళ్లు తొక్కింది. ఆయన రచనలు యావత్ ప్రపంచాన్ని అద్వైత సిద్ధాంతము మరియు సనాతన ధర్మం వైపు దారి మళ్ళించాయి. వాటిలో శివానందలహరి ప్రధానమైనది. ఇందులో పొందుపరిచిన అత్యంత విశిష్టమైన భక్తి మార్గం గురించి ఇప్పుడు మనము తెలుసుకొందాము. అందునా కార్తీక మాసములో ఈ విశేషాలను తెలుసుకోవటము ఎంతో పుణ్యదాయకం !

లహరి అనగా ప్రవాహం, ఆనంద లహరి అనగా అనంద ప్రవాహము. శివ తత్వాన్ని పట్టుకున్నవారి జీవితం ధర్మ మార్గమై ఆనంద ప్రవాహములో తేలియాడుతుంది అంటారు శంకరులు. ఆనందముతో ప్రకాశించు ఉమామహేశ్వర్లుకు ప్రణతులు అర్పిస్తూ తమ శ్లోకాలని ప్రారంభిస్తారు. అన్ని శ్లోకాలలో మన మనస్సు అనే కోతిని స్వామి పాదాలవద్ద కట్టి పడేస్తే మన జన్మ చరితార్ధమై మోక్షానికి సోపానము అవుతుంది అంటారు. ఈ కింద తెలియపరచిన కొన్ని శ్లోకాలని మననం చేసుకుందాం , ఆచరిద్దాం , ధన్యులమవదాం.

కలాభ్యాం చూడాలఙ్కృత శశి కలాభ్యాం నిజతపః-
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే ।
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున :
ర్భవాభ్యామానన్దస్ఫురదను భవాభ్యాం నతిరియమ్
భావము:

చంద్ర కళలను తమ సిగలలో అలంకరించుకొని ముల్లోకాలకు శుభాలని అనుగ్రహించే ఉమామహేశ్వర్లుకు ప్రణతులు సమర్పిస్తూ తమ శ్లోకాలని ప్రారంభించారు శంకరులు. లోకం కోసం ప్రార్ధన చేసిన శంకరలు ఎంతటి దయామయుడో ఈ శివానంద లహరి ఒక అధ్బుత తార్కాణము !

-2-

త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్ ।
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలమ్బం సామ్బం శివమతివిడమ్బం హృది భజే ॥

తల్లి జగదాంబతో కలసివున్నవాడు, ఆదిదేవుడు , త్రినేత్రుడు , నిజసర్పమును ధరించివున్నవాడు , జ్ఞానస్వరూపుడు, అనుకరించుటకు శక్యము కానివాడు అయిన ఆ ఉమాపతిని హృదయములో సేవించుచున్నాను. అంతే కాక ఇందులో మరో విశేషమున్నది , ఆ స్వామిని వేదములు ద్వారానే తెలుసుకోగలము అంటారు. వేద ధర్మాని ఎవరు ఆచరిస్తారో వారికే ఆ స్వామి సానిధ్యం లభిస్తుంది గా మరి !

మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ ।
తవ ధ్యానే బుద్ధిర్నయనయుగలం మూర్తివిభవే
పరగ్రన్థాన్ కైర్వా పరమశివ జానే పరమతః

భావము:

ఓ పరమేశ్వరా నా మనస్సు నీ పాద పద్మములందు , నా వాక్కు నీ స్తోత్ర పఠనములందు ,చేతులు నీ పూజయందు, చెవులు నీ కధలను వినుటయందు బుద్ధి నీ ధ్యానమునందు కన్నులు నీ స్వరూపము దర్శించటయందు, లగ్నం అవుగాక. మహా భాగవతములో ప్రహ్లాదుడు కూడా మన ఇంద్రియాలు అన్నీ కమలాక్షుడైన ఆ నారాయుణుడు స్మరణలో నిమగ్నం కావాలంటాడు. శివాయ విష్ణు రూపాయ , శివ రూపాయ విష్ణువే అని తెలుసుకొని, భగవతత్వం ఒకటే అని గ్రహించాలి.

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః ।
సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో

భావము:

ఓ ఉమామహేశ్వరా ! నిన్ను పూజించటానికి మంద బుద్దికల ఈ మానవుడు పూల కోసం లోతైన కొలనులో, ఎత్తైన కొండ ప్రదేశాలలో , మహారణ్యాలలో తిరుగుతున్నాడు. తన మనస్సు అనే పుష్పాన్ని సమర్పిస్తే చాలు అనే విషయాన్ని తెలుసుకోలేక పోతున్నాడు, ఆశ్చ్యర్యముగా వుంది అంటారు శంకరులు.

-3-

వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తేన భవతి ।
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి

భావము:

బ్రహ్మచారో, గృహస్థుడో , జటాధారో ఎవరైతేనెమి , ఎవరి హృదయపద్మము ఆ స్వామి పాదక్రామౌతుందో వారి సంసార భరాన్ని ఆ పరమేశ్వరుడే భరిస్తాడు , ప్రతి శ్లోకాంలోను మన భక్తి ఏ విధంగా ఉండాలో తెలియ చేసారు.

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ
నటత్యాశాశాఖాస్వటతి ఝటితి స్వైరమభితః ।
కపాలిన్ భిక్షో మే హృదయకపిమత్యన్తచపలం
దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో

మోహమనే అడవిలో ఆశలనే కొమ్మలమీద సంచరించే కోతి లాంటి మనస్సు నాది, దాన్ని భక్తి అనె తాడుతో నీ పాదాలచెంత కట్టి బడేసేటట్లుగా చెయ్యి ఓ పరమేశ్వరా అని వేడుకుంటున్నారు ఆది శంకరులు, నిజంగా ఆయన మనస్సు అంత చపలమైనదా , కాదు కాదు , మన కోసమే అయన ఆధ్రత అంతా. ఎంతటి త్యాగశీలి మన శంకరులు !

కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
గృహస్థే స్వర్భూజాఽమరసురభిచిన్తామణిగణే ।
శిరస్థే శీతాంశౌ చరణయుగలస్థేఽఖిలశుభే
కమర్థం దాస్యేఽహం భవతు భవదర్థం మమ మనః

భావము:

ఓ పరమేశ్వరా ! నేను నీకు ఏమి ఇవ్వగలను, సమస్త శుభాలు నీ వద్దనే ఉన్నాయి , బంగారు కొండ నీ చెతిలోనే వుంది , కుబేరుడు నీ పాదల చెంత కూర్చుని ఉన్నాడు, కల్పవృక్షం నీ చెంతనే వుంది. చింతామణి గుణనిక నీ ఇల్లు , నీ తలపై చంద్రుడు వున్నాడు. పరాత్పరా! అందుచేత నా మనస్సే నీదగుగాక.

-4-

భృంగీచ్ఛానటనోత్కటః కరమదిగ్రాహీ స్ఫురన్మాధవా-
హ్లాదో నాదయుతో మహాసితవపుః పఞ్చేషుణా చాదృతః ।
సత్పక్షః సుమనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనో-
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు

ఓ బ్రమరాంభ మల్లికార్జున స్వామీ , ఓ మహేశ్వరా , భృంగి ఇష్టపడనట్లుగా తాండవము చేయువాడా నారాయుణునికి అనందము నిచ్చువాడు , తెల్లని శరీరము కలవాడు అయిన ఆ పరమేశ్వరుడు నా మనస్సు అనే పద్మములో విహరించుగాక అని శరణు వేడ్తున్నారు.

ఈవిధంగా ప్రతి శ్లోకంలోను స్వామి పాదాల చెంత మన మనస్సుని , బుద్ధిని పెట్టి ప్రార్ధన చేస్తే , మన బుద్ధి వికసించి ధర్మ మార్గము వైపు పయనిస్తుంది అని తన ఆర్తిని వ్యక్తం చేస్తారు ఆది శంకరులు. అందుకే ఆ మహాపురుషుడు జగద్గురువైనాడు !

ఆయన స్తొత్రాలు అన్నీ ఆనంద ప్రవాహమయము , మన వైదిక ధర్మం యొక్క పరిమళాలు యావత్ప్రపంచం వ్యాపించి గుబాళించాయి. అహం బ్రహ్మస్మి స్థాయికి చేరుకున్న పూర్ణ యోగులు , మన ఆదిశంకరులు. అటువంటి మహాపురుషులు చూపిన ధర్మ మార్గములో నడుద్దాము , మన సనాతన ధర్మాన్ని కాపాడుదాం .

జయ జయ శంకర , హర హర శంకర !